టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది.
భారత ఆటగాళ్లు న్యూయార్క్ సీటీలో చక్కెర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షాపింగ్‌కు వెళ్లిన ద్రవిడ్, రోహిత్ భారీ వర్షంలో చిక్కుకున్నారు. భారీ వర్షం కురుస్తుండంతో రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ ఓ షాప్‌లో ఉండిపోయారు.
ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ దగ్గరకు వచ్చి ఫోటో కావాలని అడగగా.. హిట్‌మ్యాన్ అందుకు నిరాకరించాడు. "నో ఫోటో, బయట భారీ వర్షం పడుతోంది" అంటూ రోహిత్ సమాధనమిచ్చాడు. వెంటనే కారు తీసుకురావలంటూ డ్రైవర్‌ను రోహిత్ సూచించాడు. కుండపోత వర్షం పడుతుండగానే రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. పాపం వారిద్దరితో ఫోటో కోసం ఎదురు చూసిన సదరు అభిమానికి నిరాశే ఎదురైంది.