ఇప్పటి వరకూ నగరాలు, పట్టణాల పేర్లే మారుతూ వస్తున్నాయి. ఇకపై రాష్ట్రం పేరు మారనుంది. అందుకే ఆ రాష్ట్రం పేరు మార్పు కేంద్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీగా మారుతోంది.గాడ్స్ ఓన్ కంట్రీగా, అందమైన ప్రకృతి సోయగాలకు నెలవుగా, ప్రశాంతమైన కేరళ పేరు మార్చుకోబోతోంది. మలయాళం నేపధ్యంలో కేరళంగా మారేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రం పేరును కేరళ నుంచి కేరళంగా మార్చి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం సాంకేతిక కారణాలతో తిరస్కరించింది. అయినా వెనక్కి తగ్గని కేరళ పినరయి విజయన్ ప్రభుత్వం మరోసారి అసెంబ్లీలో తీర్మానం ఆమోదం చేయించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి పంపించేందుకు సిద్దమౌతోంది.రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు గత ఏడాది ఆగస్టులో అసెంబ్లీతో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని సాంకేతిక మార్పుల్ని సూచించింది. ఈ మార్పుల్ని ఆమోదిస్తూ రెండవసారి కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రం పేరు కేరళంగా మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. చాలామంది మేదావులు, భాషా పండితులు, వివిధ వర్గాల ప్రజలు ఇదే కోరుకుంటున్నారు.