నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై బైండోవర్ నమోదైంది. గత ఐదు రోజుల నుంచి కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు. దీనికి స్పందిస్తూ మంచు మనోజ్, మంచు విష్ణు నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్‌కి వచ్చారు.గొడవకు సంబంధించి విషయాలలో మంచు మనోజ్, మంచు విష్ణు నుంచి వాంగ్మూలం తీసుకున్న కమిషనర్.. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని హెచ్చరించారు. ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోసారి గొడవలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్, మంచు విష్ణు ఒక సంవత్సరం కాలం జల్‌పల్లిలో శాంతికి భంగం కలిగించకుండా ఉంటామని బాండ్ రాసి ఇచ్చారు. ఈ ఏడాది వ్యవధిలో శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించినా తగిన చర్యలు ఉంటాయని కమిషనర్ ఆదేశించారు.