Current Date: 04 Jul, 2024

ఈ కాపు నాయకులిద్దరూ ఏమయ్యారు?

గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కాపు దిగ్గజాలు  ఫలితాల పై పెదవి విప్పడం లేదు. ఆ ఇద్దరూ ఎన్నికల వేళ చేసిన హడావుడి ఒక స్థాయిలో ఉంది. ఒకరు టీడీపీ కూటమికి మద్దతుగా నిలిస్తే మరొకరు వైసీపీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతుగా పనిచేశారు. వారే మాజీ మంత్రులు కాపు నేతలు అయిన చేగొండి హరి రామజోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం. పోలింగ్ ముగిసి రెండు వారాలు దాటినా ఈ ఇద్దరు నేతలూ పెదవి విప్పడం లేదు. టీడీపీ కూటమిదే అధికారం అని చేగొండి నుంచి ప్రకటన రాలేదు. అలాగే పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని ముద్రగడ పోలింగ్ జరిగిన రెండు మూడు రోజుల తరువాత అయినా స్టేట్మెంట్ ఇస్తారనుకుంటే అదీ లేదు.  ఇక్కడ ముద్రగడ ప్రకటన కోసం అంతా ఎందుకు ఎదురుచూస్తున్నారు అంటే ఆయన పవన్ ఓటమిని బలంగా కోరుకున్నారు. పవన్ ని ఓడించకపోతే తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ఒక పెను సవాల్ చేశారు. మరి అంతలా పంతం పట్టిన పెద్దాయన దానికి తగినట్లుగా పోలింగ్ సరళి జరిగిందని చెబుతూ ప్రకటన చేస్తారు అని ఆశించిన వారిని నిరాశ తప్పలేదు. అంతే కాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన గట్టిగా ఎన్నికల ముందు చెప్పారు. ఆనక మాత్రం సైలెంట్ అయ్యారు. దీంతో ఇది వైసీపీలోనూ రాజకీయ వర్గాలలోనూ చర్చగా సాగుతోంది. మరో వైపు చేగొండిదీ అదే తీరుగా ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి ముందు నుంచే లేఖల ద్వారా సలహా సూచనలు చేస్తూ వచ్చారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ కూడా తన ఆలోచనలను పంచుకుంటూ వచ్చారు. మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పోలింగ్ జరిగి కూటమి అధికారంలోకి రానుందా అన్నది చూడాలి. ఇక పవన్ కి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రిత్వ శాఖతో ఇవ్వాలని ఆయన గతంలో కోరారు. ఇపుడు ఎందుకో సైలెంట్ అయ్యారు. ఒక వైపు నారా లోకేష్ ప్రాధాన్యత టీడీపీలో పెంచడానికి కొందరు నేతలు డిమాండ్లు చేస్తూ ప్రయత్నాలు చేస్తూంటే చేగొండి పవన్ కోసం ప్రకటనలు ఎందుకు చేయడం లేదు అన్న చర్చ ఉండనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా అర్ధ శతాబ్దానికి పైగా అనుభవం గడిచిన ఈ భీష్మాచార్యుడు ఏపీలో జరిగిన పోలింగ్ దాని సరళి మీద తనదైన విశ్లేషణ చేస్తారని అంతా ఎదురుచూసారు. కానీ అది కూడా జరగలేదు. మరి ఆయన మనసులో ఏమి ఉందో తెలియడం లేదు అని అంటున్నారు అటు ముద్రగడ, ఇటు చేగొండి మౌన ముద్రలోనే ఉండిపోవడం వెనక కారణాలు ఏమిటి దాని వెనక వ్యూహాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఇపుడే ఎందుకు అని వారు ఆగారా లేక కౌంటింగ్ తరువాత తమ గొంతులు విప్పుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా గోదావరి రాజకీయం ఒక్కసారిగా చప్పబడిపోయిందే!!