Current Date: 05 Mar, 2026

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా.. బాంబుల వర్షం!

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. సుప్రీం నేత ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ పరిణామాల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్, ఇరాక్ వంటి దేశాల్లోని తమ దౌత్య సిబ్బందిని అమెరికా ఉపసంహరించుకోవడమే కాకుండా, పశ్చిమాసియాలోని తమ పౌరులను తక్షణం ఆయా దేశాలను వీడాలని ఆదేశించింది. మరోవైపు, లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హెజ్బొల్లా దాడులకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి భూతల దాడులు ప్రారంభించింది. ఈ పోరులో ఇప్పటికే 55 మంది మరణించగా, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని లెబనాన్ ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్‌తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్‌లోని అధ్యక్ష భవనం, భద్రతా మండలి కార్యాలయం, ఐఆర్‌జీసీ కమాండ్ సెంటర్‌లే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఎయిర్, నేవీ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇరాన్‌లో మృతుల సంఖ్య 787కు చేరింది. చర్చలకు తావులేదని, అవసరమైతే ఇరాన్‌లో భూతల పోరుకు కూడా వెనకాడబోమని అమెరికా హెచ్చరించింది.