మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈరోజు రాత్రి 7:30 గంటలకు టైటిల్ పోరు జరగనుంది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ, వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. కెప్టెన్ స్మృతి మంధాన (290 పరుగులు), గ్రేస్ హారిస్ (228 పరుగులు) బ్యాటింగ్‌లో వెన్నెముకగా నిలవగా, ఆల్‌రౌండర్ డిక్లెర్క్ 15 వికెట్లతో అదరగొట్టింది. బౌలింగ్‌లో లారెన్ బెల్ 116 డాట్ బాల్స్ వేసి ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది. 2024 తర్వాత రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని బెంగళూరు పట్టుదలగా ఉంది. గత మూడు సీజన్లలోనూ ఫైనల్ వరకు వచ్చి తృటిలో కప్పును చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ నేతృత్వంలో ఈ జట్టు ఛేదనలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, లిజెల్ లీ ఇచ్చే ఆరంభంపైనే జట్టు ఆశలు ఉన్నాయి. బౌలింగ్‌లో నందిని శర్మ (16 వికెట్లు), శ్రీచరణి (14 వికెట్లు) ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.