కేరళకు వెళ్లిన ఓ కిలాడీ దొంగకు అక్కడ జరుగుతున్న పెళ్లి వేడుక అనుకోని అవకాశంగా మారింది. గుజరాత్‌కు చెందిన బక్షు అలీ అనే వ్యక్తి కన్నూర్ జిల్లా పెరింగోమ్‌లోని సీఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రంలో ఉన్న తన బంధువును కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పెళ్లి వేడుకలోకి చొరబడి, అక్కడ ఓ మహిళకు చెందిన హ్యాండ్‌బ్యాగును దొంగిలించాడు. ఆ హ్యాండ్‌బ్యాగును పరిశీలించగా అందులో పెళ్లి ఆహ్వానపత్రిక దొరికింది. దానిపై ఉన్న వధువు ఇంటి చిరునామా ఆధారంగా అలీ నేరుగా ఆ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లోని వారంతా పెళ్లికి వెళ్లడంతో కేవలం ఒక వృద్ధురాలు మాత్రమే ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు కత్తితో ఆమెను బెదిరించి, ఇంట్లోని నగలు, డబ్బు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘోర దోపిడీపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీఆర్‌పీఎఫ్ క్యాంపు నుంచి నేరస్థలం వరకు నిందితుడు ప్రయాణించిన మార్గాల్లోని 500కు పైగా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. చివరకు నిందితుడి ఆచూకీ కనిపెట్టి, రెండు నెలల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం గుజరాత్‌కు వెళ్లి బక్షు అలీని అదుపులోకి తీసుకొని కేరళకు తరలించారు.