Current Date: 20 Feb, 2026

లడ్డూ వ్యవహారంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు? అటకెక్కిన కమిటీ!

తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ వ్యవహారంపై వాస్తవాలను వెలికితీసేందుకు స్వతంత్ర విచారణ కమిటీని వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి దాదాపు రెండు వారాలు గడిచింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు ఫిబ్రవరి 3న జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాల కంటే అదనంగా జరిగిన పరిపాలనాపరమైన లోపాలను ఈ కమిటీ నిగ్గుతేల్చాల్సి ఉంది. మంత్రివర్గ సమావేశం అనంతరం మిత్రపక్షాల భేటీలో పాల్గొన్న చంద్రబాబు, సిట్ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక ఏకసభ్య కమిటీని వేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. బాధ్యులైన అధికారులను గుర్తించి, తదుపరి చర్యలకు సిఫార్సు చేయడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు. అయితే, ఈ ప్రకటన వచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడం, అటు అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయంపై మౌనంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ విచారణపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదికి చెందిన కొన్ని డైరీలకు ఢిల్లీలోని పెద్దల మద్దతు ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేంద్రం నుంచి ఏవైనా ఒత్తిళ్లు వచ్చాయా, లేదా విచారణ జరిగితే తమ ప్రభుత్వ హయాంలోని లోపాలు ఏవైనా బయటపడతాయని వెనక్కి తగ్గారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బహుశా, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించిన తర్వాతే కమిటీపై తుది ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.