Current Date: 20 Feb, 2026

వేదికపై క్షమాపణలు చెప్పిన రాజమౌళి తండ్రి.. మా వాళ్లు తప్పు చేశారు!

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన 'మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ అవార్డుల' కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. తమది సంపన్న కుటుంబమని చెబుతూనే.. గతంలో తన పూర్వీకులు అంటరానితనం పేరుతో చేసిన దారుణాలను తలచుకుంటే సిగ్గుతో తలవంచుకోవాలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'మాది సంపన్న కుటుంబం. నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు. మా పూర్వీకులు మాత్రం అంటరానితనం పేరుతో, నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశారు. అ‍ప్పటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు మనసు సిగ్గుతో, అవమానంతో కుంగిపోతుంది. మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. క్షమించండి. క్షమించండి.. క్షమించండి' అని విజయేంద్ర ప్రసాద్ వేడుకున్నారు. ప్రస్తుతం తన కార్యాలయంలో కేవలం బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫోటో మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, అంబేడ్కర్ జీవిత విశేషాలపై ప్రస్తుతం ఒక సినిమా కథను రాస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికోసం లోతైన పరిశోధన చేస్తున్నానని, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నానని పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలకు వెన్నెముకగా నిలిచే విజయేంద్ర ప్రసాద్, ప్రస్తుతం మహేశ్ బాబుతో చేయబోయే భారీ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు.