అభం శుభం తెలియని ఈ ఆదివాసీ గిరిజన బిడ్డలు వర్షాలు పడ్డప్పుడు బడికి వెళ్లాలంటే ఈ గెడ్డ దాటాల్సిందే.. ఒకటి నుండి అయిదవ తరగతి వరకూ చదివే ఈ విద్యార్థినీ విద్యార్డులు బడికి పోవాలంటే ప్రతి రోజూ రానూ పోనూ అయిదు కిలోమీటర్లు నడవాల్సిందే మధ్యలో ఈ గెడ్డ ను దాటి తీరాల్సిందే.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయితీ తెంగిల బంధం గ్రామానికి చెందిన బాలల దుస్థితి ఇది. కొండదొర ఆదివాసీ లు నివసించే ఈ గ్రామం లో అయిదవ తరగతి లోపు చదివే విద్యార్థులు 25 మంది వున్నారు. వీళ్లంతా చదువుకోడానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న గంగవరం ఎంపీపీ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ కి వెళ్ళాలి. ఈ రెండు గ్రామాల మధ్య వున్న పెద్ద గెడ్డ ఏ మాత్రం వర్షం పడినా పారుతుంది. దీన్ని ఈ పసి వాళ్ళు ఎలా దాటుకొని బడికి వెళ్ళగలరో ఇక్కడి అధికారులే సెలవివ్వాలి. అందులోనూ ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయినా విద్యాశాఖ నిద్ర పోతూనే వుంది. అయ్యా మా ఊర్లో మా పిల్లల కోసం మేమే ఒక షెడ్ వేసుకుంటాం.. ఒక్క టీచర్ ని పంపండి చాలు అని ఆదివాసీలు మోరపెట్టుకున్నా అధికారుల చెవిన పడటం లేదు. ఈ ఆదివాసీ బాలలు విద్యావంతులు కావడానికి అధికారులపై ప్రతి ఒక్కరూ ఒత్తిడి తేవాలి.