Current Date: 07 Mar, 2026

తిరుమలలో దువ్వాడపై మరో వివాదం.. కేక్ తెచ్చిన తంట!

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలతో దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని శ్రీవిభవ అతిథి గృహంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. తిరుమల కొండపైకి కేక్ తీసుకురావడం, వేడుకలు జరుపుకోవడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం కావడంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి, తనూజ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని గదుల్లో బస చేసిన సమయంలో మాధురి.. తనూజతో కేక్ కట్ చేయించారు. అంతటితో ఆగకుండా, ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీయించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు శ్రీవారి ఆలయం ఎదుట నిబంధనలకు వ్యతిరేకంగా ఫోటోషూట్ నిర్వహించి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుమల పవిత్రతను కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తదుపరి చర్యల కోసం విచారణ చేపడుతున్నారు.