పవన్ కల్యాణ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అపురూపమైన విజయాన్ని నమోదు చేశారు. రాష్ట్రంలో జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ విజయపథంలో నడిపించారు. ఒక ప్రాంతీయ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ.. అంటే, 21 అసెంబ్లీలకు గాను 21లోను, 2 ఎంపీ సీట్లకు గాను 2లోనూ గెలవడం అనేది ఇప్పటి వరకు ఎక్కడా వినని.. జరగని ఘటన.గత ఎన్నికల్లో పవన్ ఓటమిని కాపువర్గం తమకు పరాభవంగా భావించింది. ఈసారి ఆయన కాపు వర్గాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకున్నారు. దానికి తోడు పవన్ ఈసారి ఎన్నికలకు ముందు జాగ్రత్తగా చేయించుకున్నారు. చాలా స్పష్టతతో కాపు కులం ఓట్లు ఎక్కడెక్కడైతే మెజారిటీ ఉన్నాయో అలాంటి నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే.. గురి చూసి కొట్టాడు.టీడీపీ, బీజేపీని ఒప్పించి.. ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా ఆ సీట్లన్నీ తనకు కావాలని పట్టుబట్టి పవన్ తీసుకున్నారు. సహజంగానే కాపు ఓటు బ్యాంకు ఐక్యంగా ఆయనకు పనిచేసింది. పలుచోట్ల వైసీపీ కూడా కాపు వర్గం వారినే మోహరించినా జనం పట్టించుకోలేదు. కాపు అంటే పవన్ మాత్రమే అన్నట్టుగా ఓట్లు వేశారు. జనసేన పోటీ లేని చోట కాపు ఓట్లు టీడీపీకి సాఫీగా బదిలీ అయ్యాయి. దాంతో పవన్ ప్లాన్ హిట్ అయ్యింది.. కూటమి భారీ విజయాన్ని అందుకుంది.