రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల పార్టీని నడిపించడంతో ఫెయిల్ అయ్యారంటూ మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి బిడ్డగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తుందనే తామంతా ఆశించామని, అయితే అందరినీ సమన్వయం చేయడంలో షర్మిల ఫెయిల్ అయ్యారన్నారు. టికెట్ల కేటాయింపుల్లోనూ డబ్బు చేతులు మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలలో గెలుపు కోసం 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేశారన్నారు. ఇందులో కనీసం 5 శాతం కూడా వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకొని వెళ్లలేకపోయామన్నారు.