జానపద కళల్ని పరిరక్షించేందుకు మనమంతా పాటుపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తరతరాల గని ఉత్తరాంధ్రా జానపద కళలు అని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 22న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో 'ఉత్తరాంధ్రా జానపద జాతర' పేరిట కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో రామ్మోహన్ సంబరపడిపోయారు. జనగళం జానపదాన్ని సంరక్షించేందుకు పాటుపడుతున్న 'రైటర్స్ అకాడమీ' సేవల్ని ఆయన కొనియాడారు. గురువారం మధ్యాహ్నం బీచ్ రోడ్డులో సుమారు 50జానపద కళల్ని ప్రదర్శిస్తామని, అక్కడి నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు రమారమి 2వేల మంది కళాకారులు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భoగా కళాజాతగా ర్యాలీ నిర్వహిస్తామని రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణ మూర్తి చెప్పడంతో కేంద్ర మంత్రి ఉప్పొంగిపోయారు. కార్యక్రమానికి సినీ నటుడు బ్రహ్మానందంతో పాటు ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారని చెప్పడంతో తాను కుడా హాజరవుతానని రామ్మోహన్ హామీ ఇచ్చారు.
Share