పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి రావడం జరిగింది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగానూ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయనే దానిపై వివరాలతో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ అంశంపై అధికారులతో పవన్ చర్చించారు. ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. ఆ సంస్థ భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో కూడా తెలియజేయాలని పీసీబీని పవన్ ఆదేశించారు.