Current Date: 10 Mar, 2026

కేసీఆర్ కూతురు కవిత అర్ధరాత్రి అరెస్ట్.. హుటాహుటిన తరలింపు

ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహారాజ్‌తో కలిసి ఆమె సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్షకు దిగారు. పేదల గూడు చెడగొట్టడం అన్యాయమని, వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. కవిత చేపట్టిన ఈ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో దీక్షా స్థలి వద్ద ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించి హైదరాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసుల చర్యలు సరైనవి కావని బాధితులు, జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు. అరెస్టు చేసినప్పటికీ తన పోరాటం ఆగేది లేదని, దీక్షను కొనసాగిస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. వెలుగుమట్ల భూ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.