రాష్ట్రంలోని దేవాలయాలకు నెయ్యి సరఫరా అంశంపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతర అవసరాలకు వినియోగించే ఆవు నెయ్యి సేకరణ అంశంలో అనుసరించాల్సిన విధానాలపై నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల్లో వివిధ అవసరాలకు గానూ ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం పడుతుందని, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు.