Current Date: 25 Nov, 2024

ప్రజాస్వామ్యంలో ప్రజలేఎప్పుడూ గెలవాలి

సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు  రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ చాలా ఇబ్బంది పడ్డాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ ప్రజలే గెలవాలన్నారు. ఇప్పుడు అదే జరిగిందన్నారు. రాష్ట్రం నిలబడాలన్నదే తమ ధ్యేయం అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్తామన్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్నారు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు మాత్రమే శాశ్వతం అన్నారు. ఎన్నికలు రావడం, అధికారం మారుతుండడం సహజమన్నారు. ఏ పార్టీjైునా సక్రమంగా పని చేస్తేనే మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్నారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉండే వ్యక్తి కూడా ఈ ఎన్నికల కోసం ఓటు వేసేందుకు వచ్చారంటే, రాష్ట్రంలో మార్పు రావాలన్న అభిప్రాయం ఎంతగా ఉందో అర్థమవుతోందన్నారు.  పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తపనతో వచ్చి తమ కర్తవ్యం నిర్వర్తించడం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందన్నారు. టీడీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి అన్నారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినపుడు 1983లో 200 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం టీడీపీకి, 39.37 శాతం వైసీపీకి వచ్చాయని చంద్రబాబు తెలిపారు. సభలో తనను అవమానాలకు గురి చేసినప్పుడు ఎంతో బాధ పడ్డానని, అందుకే మళ్లీ సీఎం అయిన తర్వాతే సభకు వస్తానని ప్రతిజ్ఞ చేశానన్నారు. అలాగే తన భార్య, కుటుంబానికి తీవ్రంగా అవమానించినప్పుడు తీవ్ర ఆవేదనకు గురయ్యానని చంద్రబాబు చెప్పారు. మళ్లీ ఇంతటి విజయం ప్రజలు సహకరించడం వల్లే సాధ్యమైందన్నారు.