Current Date: 03 Oct, 2025

బంగారం కోసం కన్న తల్లిని చంపేశాడు

మద్యానికి బానిసగా మారిన కొడుకు తల్లి మెడలోని బంగారు తాడు కోసం నవమాసాలు మోసి, కని అల్లారు ముద్దుగా పెంచిన కన్నతల్లిని చంపేసిన అమానవీయ ఘటన నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాతవరం మండలం వై.బి.పట్నం గ్రామంలో జరిగింది.  హంతకుడు చిటికెల రామ్మూర్తి రాయుడు ను, 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో మద్యం తాగి, పెద్ద కేకలు వేస్తూ, తండ్రిని తోసేసి,  పూల కుండీతో తల్లి తలపై బలంగా కొట్టాడు. మెడలో ఉన్న బంగారుతాడు ఇవ్వకపోతే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. ఇవ్వడానికి నిరాకరించడంతో తిరిగి పూల కుండీతో తలపై కొట్టి, కన్నతల్లి మెడను కాలితో తొక్కి బంగారు తాడు తీసుకొని పారిపోయాడు. తీవ్ర గాయాలు పాలైన తల్లి చిటికెల మంగ అక్కడిక క్కడే మరణించింది. ఫిర్యాదు అందిన వెంటనే సిఐ రేవతమ్మ సంఘటన స్థలానికి చేరుకొన్నారు. పరారు కావడానికి ప్రయత్నిస్తున్న అంతకుడు రామ్మూర్తినాయుడుని నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం తెలుసుకొని సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో నాతవరం పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి 21 గ్రాముల బంగారు తాడు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం సాయంత్రం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, రూరల్ ఎస్సై పి రాజారావు, గొలుగొండ ఎస్సై పి.రామారావు లు పాల్గొన్నారు.

Share