Current Date: 27 Nov, 2024

బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లో కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

ఎవరి మీద అయితే అవినీతి ఆరోపణలు వచ్చాయో వారినే పక్కన పెట్టుకొని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తనిఖీలు నిర్వహించడం పెద్ద ప్రహాసంగా మారింది. బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ పేరు చెప్పి కాంట్రాక్టర్‌ ద్వారా టూరిజం ఆర్‌డీ అండ్‌ టీమ్‌ కోట్ల రూపాయలు కుమ్మేసిన విషయం తెలిసిందే. ‘రుషికొండ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లో అవినీతి కెరటాలు’ శీర్షికన ‘లీడర్‌’ ఇక్కడి అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. 
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ హరేంధీర ప్రసాద్‌ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ను బుధవారం సందర్శించారు. దీంతో ఇక్కడ జరిగిన అవినీతిపై కలెక్టర్‌ విచారిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ సీన్‌ వేరే విధంగా కనబడే సరికి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అనూహ్యంగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ చుట్టూరా అవినీతి తిమింగలాలే కనిపించాయి. ఈ జిల్లాతో సంబంధం లేని దాస్‌ కలెక్టర్‌ పక్కనే వుంటూ కలియ తిరిగాడు. దాస్‌ విజయనగరం జిల్లాలో పనిచేస్తూ అల్లూరి జిల్లా ఇన్‌ఛార్జిగా వుంటున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ నిర్వహణ కాంట్రాక్టర్‌తో దాస్‌కు కూడా లాలూచీలు వున్నాయి. దాస్‌ భార్యకు నెలనెలా కాంట్రాక్టర్‌ జీతం ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఆమె పార్కింగ్‌ దగ్గర టిక్కెట్లు కలెక్ట్‌ చేస్తుంటారు. రాత్రి అయ్యే సరికి వచ్చిన కలెక్షన్లన్నీ దాస్‌ ఇంట్లో లెక్క పెడతారని, పంపకాలు కూడా అక్కడే జరుగుతాయని టూరిజంలో పని చేసే అందరికీ తెలుసు. దీన్ని బట్టి కాంట్రాక్టర్‌తో వున్న గూడుపుఠాణీ బయటపడుతోంది. ఇప్పటికైనా కలెక్టర్‌ తేరుకోకపోతే విశాఖ సముద్రపు కెరటాల్లో టూరిజం శాఖ కొట్టుకుపోవడం ఖాయం.

Share