Current Date: 05 Aug, 2026

సహజీవనంలో ఉన్న మహిళలపై వేధింపులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

భర్త లేదా అతని బంధువులు భార్యను మానసికంగా, శారీరకంగా హింసించినప్పుడు ఐపీసీ సెక్షన్ 498A  కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే, ఈ సెక్షన్ సహజీవనం చేస్తున్న జంటలకు వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దీనిపై అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ తీర్పును ప్రకటించింది. వివాహం చేసుకోవాలనే ఆలోచనతో, వివాహబంధంలో ఉన్నట్లుగానే సహజీవనం చేసే జంటలకు కూడా సెక్షన్ 498A వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి సహజీవనంలో ఉన్న పురుషుడు లేదా అతనికి సంబంధించిన బంధువులు వేధింపులు లేదా హింసకు పాల్పడితే ఈ సెక్షన్ కింద విచారించవచ్చని స్పష్టం చేసింది. అయితే, సహజీవనంలో ఉన్న మహిళపై పురుషుడు గానీ, అతని బంధువులు గానీ హింసకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో  తేలిన తర్వాతే వారిని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. గృహహింసను నిరోధించడమే సెక్షన్ 498A యొక్క ముఖ్య లక్ష్యమని, అది వివాహిత దంపతులకు వర్తించినట్లే, పెళ్లి చేసుకునే ఉద్దేశంతో కలిసి ఉంటున్న సహజీవన జంటలకు కూడా సమానంగా వర్తిస్తుందని అత్యున్నత  న్యాయస్థానం తీర్పు ఇచ్చింది