కొండ దిగువ తొలిపావంచా వద్ద టెంకాయ కొట్టి సింహగిరి ప్రదక్షిణ ప్రారంభించడం సంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో కొబ్బరికాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. రాష్ట్రంలోని కొబ్బరికాయల వ్యాపారస్థులు వాహనాల్లో లక్ష టెంకాయలను సింహాచలం చేరుస్తున్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు, వేపగుంట, శ్రీకృష్ణాపురం, పాత అడివివరం కూడళ్లు మొదలు కొని సింహాచలం తొలిపావంచా వరకు దుకాణాలు ఏర్పాటుకు చిరు వ్యాపారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డుకు ఇరువైపుల టెంకాయ దుకాణాలు వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వ్యాపారులు టెంకాయలు కుప్పలుగా వేసేశారు. గత ఏడాది సుమారుగా 12 లక్షల టెంకాయలు వ్యాపారం జరిగినట్టు హోల్ సేల్ వ్యాపారులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల వరకు కొబ్బరికాయలు తీసుకువచ్చే అవకాశం ఉందని తూర్పుగోదావరి జిల్లా కి చెందిన వ్యాపారి తెలియజేశారు. టెంకాయ సైజుని బట్టి 20 నుండి 50 రూపాయిల వరకు ధర నిర్ణయిం జరుగుతుందన్నారు.