ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిని సెలెక్ట్ అయ్యావని చెప్పి.. ఆ తర్వాతి రోజు ఇంటికి వచ్చి సిమ్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్. హైదరాబాద్ మధురానగర్‌లో ఉన్న టెక్ ఫ్లో అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో జాబ్ కోసం ఓ యువతి అప్లికేషన్ పెట్టుకుంది. కొద్ది రోజులకు సదరు యువతికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. దీంతో ఆ అమ్మాయి.. మధురానగర్‌లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్లింది. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం పూర్తయింది. మేనేజర్ రౌండ్ కూడా పూర్తి కాగా.. ఆ కంపెనీ మేనేజర్ అయిన నవీన్ కుమార్.. ఆ అమ్మాయికి మీరు ఈ జాబ్‌కు సెలెక్ట్ అయ్యారు కంగ్రాట్స్ అని కూడా చెప్పాడు. మీరు వెంటనే జాయిన్ కావొచ్చు అని కూడా చెప్పాడు.
జాబ్ కోసం నిరీక్షిస్తున్న ఆ అమ్మాయికి ఆ మాటలతో ఆనందానికి అవధుల్లేవు. కానీ.. మేనేజర్ ఓ మెలిక పెట్టాడు. జాబ్‌లో జాయిన్ కావాలంటే ఆఫీస్ సిమ్‌కార్డ్ కచ్చితంగా ఉండాలని చెప్పాడు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ యువతికి మేనేజర్ చెప్పే మాటలపై ఎలాంటి అనుమానం రాలేదు. అయితే.. ఆ సిమ్ కార్డు ఇవ్వాలంటే.. తాను ప్రస్తుతం బిజీగా ఉన్నానని, సిమ్‌కార్డు కలెక్ట్ చేసుకునేందుకు నేరుగా తన ఇంటికి రావాలని చెప్పాడు. ఆ మేనేజర్ మాయమాటలు నిజమేనని నమ్మిన ఆ అమ్మాయి.. ఆ మాటల వెనుక ఆ మేనేజర్ తప్పుడు భావనను అర్థం చేసుకోలేకపోయింది.
ఆమె ఇంట్లోకి రాగానే డోర్ లాక్ చేసి యువతిపై అత్యాచారానికి ఎగబడ్డాడు. తాను ఏదో ఊహించుకుని వస్తే.. మేనేజర్ ఊహించని ప్రవర్తనకు షాక్ అయిన యువతి.. కేకలు వేసింది. అరిస్తే చంపుతానని ఆ మేనేజర్ బెదిరించినా భయపడకుండా.. అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆ యువతి.. నేరుగా మధురానగర్ పోలీస్ స్టేషన్‌కి చేరుకుంది. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.