దేశవ్యాప్తంగా విద్యార్ధుల భవిష్యత్తుతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెలగాటమాడుతోంది. పరీక్ష ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందు నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేసింది. ఎన్టీయేపై ఆరోపణలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.నీట్ యూజీ 2024 పరీక్షల్లో గ్రేస్ మార్కుల వివాదం, పేపర్ లీకేజ్ వ్యవహారానికి తోడు అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్, పరీక్ష రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తొలుత నీట్ 2024 పరీక్ష పేపర్ లీక్ కాలేదని బుకాయించిన ఎన్టీఏ..బీహార్‌లో వరుస అరెస్టులు, లీక్ వ్యవహారం వెలుగు చూడటంతో కిమ్మనడం లేదు. ఎన్టీయే వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నీట్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. కొత్త డీజీగా ఐటీపీవో ఛైర్మన్ ప్రదీప్ సింగ్ ఖరోరాకు బాధ్యతలు అప్పగించింది.