Current Date: 04 Jul, 2024

ఓటు వేయని బీజేపీ ఎంపీ... పార్టీ షోకాజ్ నోటీసులు జారీ...

ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా ఓటు వేయలేదు. ఈ ఎన్నికల్లో సీటు తనకు కాకుండా మనీశ్ జైస్వాల్‌కు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జయంత్ సిన్హా ఓటు వేయలేదు. అయితే ఎంపీగా ఉండి కనీసం ఓటు కూడా వేయకపోవడంపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఎంపీ జయంత్ సిన్హాకు షోకాజ్ నోటీసులు పంపించింది. 
పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని పార్టీ ప్రశ్నించింది. ‘‘హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించిన నాటి నుంచి పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కనీసం ఓటు వేయాలని కూడా మీరు భావించలేదు. మీ ప్రవర్తనతో పార్టీ ప్రతిష్ట మసకబార్చింది’’ అంటూ జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు నోటీసులో పేర్కొన్నారు.