ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. బ్యాంకాక్ నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడిపై వేడి కూర పడటంతో జరిగిన అసౌకర్యానికి గానూ, సదరు సంస్థకు రూ. 25 వేల జరిమానా విధిస్తూ బెంగళూరు వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ నిర్ణయం వెలువడింది. ప్రయాణికులకు ఆహారం అందిస్తున్న సమయంలో సిబ్బంది చేతిలోని వేడి కూర పొరపాటున ఒక ప్రయాణికుడిపై పడింది. దీంతో అతని దుస్తులు పాడవడమే కాకుండా, శరీరంపై స్వల్పంగా కాలింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఇండిగో సంస్థ, పరిహారంగా రూ. 5 వేల ట్రావెల్ వోచర్‌ను ఆఫర్ చేసింది. అయితే, తాను శాకాహారినని, మాంసాహార కూర తనపై పడటం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తన ఫోన్, వాచ్ వంటి వస్తువులు కూడా దెబ్బతిన్నాయని పేర్కొంటూ ఆ వోచర్‌ను తిరస్కరించి ఆయన ఫోరంను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం, ప్రయాణికుడి పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరులో నిర్లక్ష్యం ఉందని అభిప్రాయపడింది. బాధితుడు రూ. 5 లక్షల పరిహారం కోరినప్పటికీ, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రూ. 20 వేల పరిహారం, అలాగే కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5 వేలు కలిపి మొత్తం రూ. 25 వేలు చెల్లించాలని ఇండిగో సంస్థను ఆదేశించింది.
Share