భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపి ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. బంగ్లాకు అన్యాయం జరిగిందని వాదిస్తూ, మొదట టోర్నీ నుంచే తప్పుకుంటామని బెదిరించిన పాకిస్థాన్, చివరికి మెట్టు దిగి కేవలం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను (ఫిబ్రవరి 15) మాత్రమే బహిష్కరిస్తామని ప్రకటించింది. ఈ మొండి వైఖరి వల్ల పాక్ బోర్డు ఐసీసీ నుంచి కఠిన ఆంక్షలను, భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత ఒప్పందాల ప్రకారం పాక్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడాల్సి ఉండగా, భారత్‌తో తలపడబోమని చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ తరుణంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా 2021లో చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం భారత మార్కెట్ నుంచే వస్తుందని, ఒకవేళ భారత ప్రధాని తలచుకొని ఫండింగ్ ఆపేస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలిపోతుందని ఆయన ఆ వీడియోలో హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి పీసీబీ అనవసర వివాదాల్లో తలదూర్చుతోందని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో పీసీబీ - ఐసీసీ హెచ్చరిక భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల బ్రాడ్‌కాస్టర్లకు సుమారు రూ. 250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని పీసీబీ నుంచే వసూలు చేస్తామని, అలాగే పాక్‌కు అందాల్సిన వార్షిక నిధులను (సుమారు 35 మిలియన్ డాలర్లు) నిలిపివేస్తామని ఐసీసీ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ బోర్డు, భారత్‌తో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని రమీజ్ రాజా చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
Share