Current Date: 08 Feb, 2026

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం.. ఇన్వెస్టర్లు లబోదిబో!

స్టాక్ మార్కెట్ అనేది ఒక అంతుచిక్కని మాయా ప్రపంచమని, ఇక్కడ మేధావులు సైతం ఒక్కోసారి నష్టపోతారని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. తాజాగా బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన ధరలు, గత మూడు నాలుగు రోజులుగా ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ లాభాల కోసం పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధరల పతనం గణాంకాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే గ్రాముకు రూ. 3 వేలకు పైగా తగ్గింది. నాలుగు రోజుల క్రితం రూ. 17,885 గా ఉన్న గ్రాము బంగారం ధర, నేడు రూ. 14,700 కి పడిపోయింది. వెండి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జనవరి 29న కిలో వెండి ధర రూ. 4.25 లక్షలు పలుకగా, ప్రస్తుతం అది రూ. 3 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ. 1.25 లక్షల ధర తగ్గడం గమనార్హం. ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతో క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేసి మరీ బంగారం, వెండి కొనుగోలు చేసిన సామాన్య ఇన్వెస్టర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది బాధితులు తమ ఆవేదనను పంచుకుంటున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేయకుండా భారీగా పెట్టుబడులు పెట్టిన వారు, ఈ ఆకస్మిక ధరల పతనంతో లక్షలాది రూపాయలు నష్టపోయి కన్నీరు మున్నీరవుతున్నారు.