ప్రముఖ దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటేనే సింప్లిసిటీ.. ఎన్నో కోట్ల ఆస్తికి అధిపతిగా అయినా ఒక సాధారణ వ్యక్తిలా జీవించారు. జంతు ప్రేమికుడిగానే కాకుండా మానవతామూర్తిగానూ ఖ్యాతిని సంపాదించారు. రతన్ టాటాకు మూగజీవాల పట్ల ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోనూ వీధి శునకాల అంటే ఎక్కువగా ఇష్టం. వాటి సంరక్షణ కోసమే ఎన్నో ఆస్పత్రులను కట్టించారు. అయితే, తాజాగా రతన్ టాటా వీలునామాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం.. రతన్ టాటా వ్యక్తిగత సంపద దాదాపు రూ. 10వేల కోట్లుగా అంచనా. అయితే, ఆయన రాసిన వీలునామా ప్రకారం.. మొదటగా పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క ‘టిటో’ జీవితకాల సంరక్షణ కోసం కూడా కొంత వాటాను కేటాయించారట. అంతేకాదు.. ఈ వీలునామాలో ఆయన చాలాకాలంగా వంటవాడిగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షా, సేవకుడు బట్లర్ సుబ్బయ్యకు ఈ పెంపు కుక్క బాధత్యలను అప్పగించినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి.