Current Date: 27 Nov, 2024

జీతం గురించి ప్రజావాణిలో ఫిర్యాదు గంటల్లోనే ఉద్యోగం పోయింది

తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో తనకి జీతం పూర్తిగా రావట్లేదని ఓ మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఫిర్యాదు చేయడమే పాపమైపోయింది. ఆమె జీతం జీతం విషయం దేవుడెరుగు చివరికి ఉద్యోగమే తీసేశారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ఎక్స్ ద్వారా బయటపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.మేడ్చల్‌ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్‌లో కుటుంబంతో సహా నివాసం ఉంటోంది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె జీతం రూ.15 వేలు కాగా.. ఏజెన్సీ మాత్రం వేతనంలో కోత పెట్టి రూ.10 వేలు మాత్రమే ఇస్తోందని రేణుక ఆరోపిస్తుంది. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ప్రజా భవన్‌కు చేరుకొని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ గంటల వ్యవధిలోనే రేణుకను ఉద్యోగం నుంచి తీసేసింది.ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని ఎద్దేవా చేశారు. రేణుకను ఉద్యోగంలో నుంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారిని డిమాండ్‌ చేశారు.

Share