ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ ప్రకటించారు. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన కలిగించేందుకు మహీ తోడ్పాటు అందిస్తారని ఆయన తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వాడుకునేందుకు కూడా ఎంఎస్‌డీ అంగీకరించినట్లు ఈసీ వెల్లడించింది. ఇదిలాఉంటే వచ్చే ఏడాది జనవరి 5తో ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దాంతో ఈ నవంబర్‌లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇక 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఝార్ఖండ్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలి విడతలో 43 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడవుతాయి.