అప్పన్న నిజరూపదర్శనం, అక్షయ తృతీయ రెండూ ఒకే రోజు వస్తుండడంతో చందనోత్సవంలో జనసందోహం అంతా ఇంతా కాదు. ఓ వైపు ప్రోటోకాల్ దర్శనాలు, మరోవైపు, మరోవైపు అంతరాలయ దర్శనాలు, ఇంకోవైపు రాజకీయ నేతల హంగామా కనిపిస్తుండేది. కానీ ఈ సారి అప్పన్నదర్శనంలో అలాంటిదేమీ లేకుండానే లైన్లన్నీ ముందుకు కదిలాయి. ఉదయం 10.30గంటల వరకు వాతావరణం కూడా చల్లగానే ఉండడంతో జనం హాయిగా ఆ స్వామిని దర్శించుకున్నారు. ఇంతకీ విషేశమేంటంటే గతేడాది జరిగిన పొరపాటును దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రోటోకాల్ దర్శనాలతో పాటు అంతరాలయ దర్శనాల్నీ రద్దు చేసేశారు. రద్దీని తగ్గించేందుకు అధికారులు చేసిన కృషీ ఫలించింది. విక్రయించిన టిక్కెట్లు సగమే అయితే వాటికి రెండిరతలు పాస్‌లు కనిపించేవి. మరికొన్ని ఆబ్లిగేషన్ పాస్‌లంటూ ఎవరికి వారే తమకు నచ్చిన వారికి దర్శనాలు చేయించేవారు. అంతరాలయంలో తోపులాటలు తప్పేవి కావు. ఈ సారి ఎన్నికల సమయం కూడా రావడంతో నేతలు ప్రచారానికే పరిమితమైపోయారు. కార్ పాసులు లేకపోవడంతో మరికొంతమంది రాలేదు. ఎండ తీవ్రతకు ఇంకొంతమంది దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. నేతల రాక సందర్భంగా ఎప్పుడూ వివాదమే అయ్యేది. గతేడాది విద్యాశాఖ మంత్రి బొత్స తన కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చినప్పుడు పెద్ద దుమారమే రేగింది. ఆ కుటుంబంతో పాటు వందలాది మంది లోనకు వెళ్లిపోయారు. క్లూలైన్లలో ఉన్న భక్తులంతా ఇది చూసి గగ్గోలు పెట్టారు. ప్రభుత్వాన్ని నిందించారు. ప్రోటోకాల్ దర్శనాల వల్లే ఇలా జరుగుతోందని గుర్తించి ఈ సారి వాటిని రద్దు చేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
..
మొబైళ్లకు తాళం లేదు
..
గతంలో అంతరాయ దర్శనాల సమయంలో స్వామి వీడియో ఒకటి బయటకు వచ్చింది. మొబైల్ ఫోన్లను లోనకు అనుమతించమంటూ ప్రకటించినా వీడియోలు మాత్రం బయటకు వచ్చేశాయి. అయితే ఈ సారి అంతరాయ దర్శనాలు రద్దయ్యాయనో ఏమో గానీ సెల్‌ఫోన్లతోనే అంతా దర్శనానికి వెళ్లారు. ఇదిలా ఉంటే పోలీసులు, దేవదాయ శాఖ, రెవెన్యూ సిబ్బందిని భారీగా నియమించడంతో భక్తుల కంటే వారే ఎక్కువగా కనిపించారు. దీనికి తోడు వలంటీర్లను కూడా ఎక్కడికక్కడ అధికంగా నియమించి, భక్తులకు ఇబ్బందుల్లేకుండా చేశారు. వైద్యఆర్యోగశాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ శిబిరాలేర్పాటు చేసినప్పటికీ గాలిగోపురం వద్ద జన సంచారం లేని చోట ఓ శిబిరం పెట్టడం చర్చనీయాంశమైంది. అదే విధంగా ఈసారి కూడా ప్రసాదాల గోల లేకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎక్కడిక్కడ ప్రసాదాలతో పాటు శీతల పానీయాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్, కర్బూజా వంటివి భారీగా పంపిణీ చేసి ఆకట్టుకున్నారు.
..
గంథం అమావాస్య రోజు 60వేల మంది
..
జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో గత అనుభవాల నేపథ్యంలో ముందునుంచీ ఈ సారి ఉత్సవాన్ని పేరు పోకుండా ఎలాగైనా పూర్తి చేయాలని భావించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందరూ తమ వాహనాల్ని కిందే ఉంచేసి ఆలయ బస్సుల్లోనే కొండపైకి రావాలని ఆదేశించడం, డ్యూటీ పాసులిచ్చిన పోలీసులే పైకి రావాలనడం వంటి హెచ్చరికల కారణంగా జనం చాలా మంది ఇళ్లకే పరిమితమైపోయారు. ఇన్ని నిబంధనల మధ్య స్వామి దర్శనం అవసరమా అనుకుంటూ మానేశారు. మరో విశేషమేమిటంటే మొన్నటి గంథం అమావాస్య రోజున కనీసం 60వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారని అంచనా. పోలీసుల హంగామా, అధికారుల హడావుడి లేకుండానే అన్ని వేల మంది భక్తులు సులువుగా దర్శనం చేసుకున్నారని అక్కడి వారే చెబుతున్నారు. మరి చందనోత్సవం రోజున అంతకు రెండిరతలు అంటే కనీసం 1.2లక్షల మంది జనాభా దర్శనం కోసం వస్తారనుకున్నా ఏర్పాట్లు చూస్తే మాత్రం బెంబేలెత్తిపోక తప్పదు. గత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భక్తులు మాత్రం అధికంగా రాలేదనే చెబుతున్నారు.
..
రూ.1500 టిక్కెట్లెక్కడ?
..
గతంలో ప్రింట్ చేసిన వాటి కంటే అధికంగా టిక్కెట్లు, పాస్‌లు రావడంతో సాక్ష్యాత్తూ జిల్లా కలెక్టరే ఆశ్చర్యపోయారు. వాటిని నియంత్రించేందుకు ఈసారి చర్యలు చేపట్టినప్పటికీ టిక్కెట్లు మాత్రం అందరికీ దక్కలేదని అపవాదును మాత్రం మూటగట్టుకున్నారు. రూ.300టిక్కెట్లు 25వేలు, రూ.1000టిక్కెట్లు 15వేలు, రూ.1500టిక్కెట్లు 6వేలు విక్రయించారని చెబుతున్నా రూ.1500ధర కలిగిన టిక్కెట్లు మాత్రం ‘పెద్ద’లకే అందాయని, కౌంటర్ల వద్దకు వెళ్లి భక్తులు ఆరా తీసినా అయిపోయాయనే సమాధానం వచ్చిందంటున్నారు. అయితే గతంలో కంటే ఈ సారి రూ.1500టిక్కెట్ లైన్ మాత్రం వేగంగా కదిలిందంటున్నారు. టిక్కెట్ తీసుకుంటే చాలు స్లాట్‌తో సంబంధం లేకుండా పంపించడం, ఉద్యోగులకు ఇచ్చిన టిక్కెట్లను (రూ.300కడితే రూ.1500లైన్‌లో అనుమతించడం) మధ్యాహ్నం దాటాక అనుమతించడం వంటివి ఫలించాయనే చెప్పవచ్చు. మొత్తానికి రాజకీయ నేతల హంగామా లేకపోతే సాధారణ భక్తులు బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చని మాత్రం ఈ సారి రుజువైంది.