అయోధ్య రామాలయానికి కంచి మఠం సమర్పిస్తున్న శ్రీరామ యంత్రాన్ని పూజలు నిర్వహించి ఊరేగింపుగా తిరుపతి నుంచి అయోధ్యకు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ పంపించారు. దశరధుడికి కంచితో ఉన్న అనుబంధం దృష్ట్యా పంచలోహాలతో శ్రీరామ యంత్రాన్ని రూపొందించినట్లు విజయేంద్ర సరస్వతి స్వామీ తెలిపారు. నిన్నటి నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల మీదుగా 1800 కిలోమీటర్లు యాత్రగా శ్రీరామయంత్రం అయోధ్యకు చేరుకుంటుందని వివరించారు. నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అయోధ్యలో మహా చండి యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా చండీయాగంలో శ్రీరామ యంత్రాన్నిపెట్టి పూజలు చేస్తామని అన్నారు. ఆ తర్వాత యంత్రాన్ని ఉత్తరాయణంలో అయోధ్యలోని రామ మందిరంలో పూజల కోసం సమర్పిస్తామని విజయేంద్ర సరస్వతి స్వామీ వెల్లడించారు.