వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిరణ్ కుమార్ తన భార్య పద్మజను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య లావుగా మారిందని, జంక్ ఫుడ్ ఎక్కువగా అడుగుతోందని, తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్న కిరణ్.. ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం గత నెల 29న తన తల్లిదండ్రులను చూడాలనే నెపంతో ఆమెను ప్రొద్దుటూరుకు తీసుకువెళ్లి, పథకం ప్రకారం ప్రాణాలు తీశాడు. ఈ హత్య కోసం కిరణ్ కుమార్ గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన వ్యక్తితో రూ. 80 వేలకు ఒప్పందం కుదుర్చుకుని కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. ఆ విషాన్ని పాలకోవాలో కలిపి భార్యకు తినిపించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, తలదిండుతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు మూడు గంటల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, ఆమెకు గుండెపోటు వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవపరీక్ష నివేదికలో లభించిన కీలక ఆధారాలతో నిందితుడు కిరణ్‌ను పోలీసులు గట్టిగా విచారించగా అసలు నిజం బయటపడింది.