Current Date: 02 Jul, 2024

విశాఖ పోలీసులకు రౌడీషీటర్‌ సవాల్‌!

విశాఖ పోలీసులకు ఓ రౌడీషీటర్‌ సవాల్‌ విసిరాడు. 2019నుంచి తన వద్ద ఎంతోమంది అధికారులు, సిబ్బంది డబ్బులు తీసుకున్నారని, అందుకు తన వద్ద ఆధారాలూ ఉన్నాయని ఓ వీడియోలో పేర్కొనడం ఇప్పుడు సంచలనమైంది. ఆ వీడియో కూడా విశాఖ సిటీ పోలీస్‌ శాఖలో వైరలవుతోంది. వాస్తవానికి ఓ రౌడీషీటర్‌ను బెదిరించి, దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలపై మల్కాపురం సీఐ ఎన్‌.సన్యాసినాయుడ్ని అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ సంఘటన తర్వాత అదే రౌడీషీటర్‌ వరుస వీడియోలు రిలీజ్‌ చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఈ వీడియోపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ఈ వీడియో చూస్తే విశాఖలో రౌడీషీటర్ల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతెంత డబ్బు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రౌడీషీటర్లను కౌన్సెలింగ్‌ పేరిట స్టేషన్‌కు రప్పించడం, వారి ఫొటోల్ని స్టేషన్‌ ఆవరణలో పొందుపర్చడం, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వారితో మాట్లాడొద్దంటూ కోర్టులే  చెబుతున్నాయి. ఈ లెక్కన విశాఖ పోలీసులు కోర్టు ఆదేశాల్నీ భేఖాతరు చేస్తున్నారని తెలుస్తోంది.
..
ఫిర్యాదుల్ని మార్చేసిన ఏసీపీ
..
మల్కాపురం పీఎస్‌లో ఇటీవల సీతమ్మధారకు చెందిన కొయిలాడ వి.వర జగదీష్‌ అనే రౌడీషీటర్‌..తనను పోలీసులు కొట్టారని, తాను పశ్చిమ ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకోమని సీఐ సన్యాసినాయుడు తనపై ఒత్తిడి తెచ్చారని మౌఖికంగా చెప్పడంతో సీపీ ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయితే కేవలం ఓ రౌడీషీటర్‌ ఇచ్చిన మౌఖిక ఫిర్యాదును ఆధారంగా చేసుకుని,  సీఐను సస్పెండ్‌ చేయడంపై సహచర పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రనక పగలనక పనిచేస్తున్న పోలీసుల మాట కంటే రెండు మూడు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలెదుర్కొంటున్న ఓ రౌడీషీటర్‌ చెప్పిన ఉదంతాన్నే అధికారులు పరిగణలోకి తీసుకోవడంపై చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అదే రౌడీషీటర్‌ సంబంధిత స్టేషన్‌ కానిస్టేబుళ్లను బూతులు తిట్టాడు. ఆ ఆడియో కూడా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా రౌడీషీటర్‌పై సిబ్బంది చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుపైనా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనంతటి వెనుక ఓ ఏసీపీ హస్తం ఉందని వస్తున్న ఆరోపణలపైనా అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల బరిలో ఉన్న ఓ అభ్యర్థికి ఓ ఏసీపీ సలహాలివ్వడం, ఆయన చెప్పాకే తాను ఫిర్యాదిస్తానని పోలీస్‌ సిబ్బంది ముందే రౌడీషీటర్‌ రెచ్చిపోవడం గమనార్హం. పైగా తొలుత ఇచ్చిన ఫిర్యాదును మార్చేసి పోలీస్‌ సిబ్బందికి వ్యతిరేకంగా మరికొన్ని అంశాల్ని జోడిరచి రెండోమారు ఫిర్యాదు చేయించడం వెనుక కూడా ఆ ఏసీపీ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. మల్కాపురం సీఐతో ఉన్న విబేధాల్ని దృష్టిలో పెట్టుకుని, తనకు కావాల్సిన వ్యక్తిని ఆ స్టేషన్‌ అధికారిగా నియమించుకుందామనే భావనతోనే సదరు అధికారి అలా చేయించి ఉంటారని కమిషనరేట్‌ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే మల్కాపురం స్టేషన్‌లో అసలేం జరుగుతోందంటూ పత్రికల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో రౌడీషీటర్‌ జగదీష్‌ కుటంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేయించడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే రౌడీషీటర్‌ ఇచ్చిన ఫిర్యాదుకు విశాఖలో ఎంత గౌరవం ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని, సీఐను సస్పెండ్‌ చేయించిన రౌడీషీటర్‌ పోలీసులకు సవాల్‌ విసురుతుంటే..ఓ ఏసీపీ చేతలకు బలైపోయిన సీఐ మాత్రం ఇంట్లో కూచున్నారంటూ విశాఖ సిటీ పోలీసులు ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తుల్లో రౌడీషీటర్లంతా మూకుమ్మడిగా పోలీసులపై దాడులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు.