Current Date: 25 Feb, 2026

స్వర్ణ దేవాలయం తరహాలోనే తిరుమలకు కొత్త చట్టం.. డిక్లరేషన్ తప్పనిసరి!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి సరఫరా వంటి అపచారాలు పునరావృతం కాకుండా, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం తరహాలోనే, తితిదే కోసం ఒక పటిష్టమైన చట్టాన్ని తెచ్చే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అపరాధులకు క్రిమినల్ శిక్షలు పడేలా నిబంధనలను కఠినతరం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా, అన్యమతస్తుల ప్రవేశంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో దైవదర్శనం చేసుకోవాలనుకునే అన్యమతస్తులు తమకు హిందూ ధర్మంపై విశ్వాసం ఉందని తెలిపే 'డిక్లరేషన్' ఇవ్వడం ఇకపై తప్పనిసరి కానుంది. గతంలో దీనిపై ఉన్న సడలింపులను తొలగించి, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని శాసనసభలోని తన ఛాంబర్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో సీఎం స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈరోజు శాసనసభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. కూటమికి చెందిన సుమారు 10 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను ఎండగట్టనున్నారు. గొంతు నొప్పి కారణంగా నిన్న సభకు రాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ చర్చలో పాల్గొంటారని తెలుస్తోంది. చర్చ ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.