బంగాళాఖాతంలో ఈ రోజు మరో అల్ప పీడనం ఏర్పడనుంది. బుధవారం నాటికి అది తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ తుఫాన్‌పై భారత వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందే ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక బులెటిన్ మేరకు ఉత్తరాంధ్రలో ఈనెల 23 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కాగా.. కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఈ నెల 24వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదివారం హెచ్చరించింది.