తమిళ చిత్ర పరిశ్రమ కోలీవుడ్‌లో సంక్షోభం మొదలైంది. నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది. తమిళ నిర్మాతల ప్రధాన డిమాండ్స్ ఏంటంటే? అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి. ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి. నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగాలి. కానీ ఈ డిమాండ్స్‌పై పెద్ద హీరోలు సైతం పెదవి విరుస్తున్నారు.