కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్టీ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి ఒక వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు. ఝార్ఖండ్‌కు చెందిన రంజిత్‌కుమార్ జాదవ్ అనే వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి, సుమారు 20 నిమిషాల పాటు రాయితో యంత్రాన్ని పగులగొట్టేందుకు, ఇనుప ఊచతో నగదు ఉండే తలుపును తెరిచేందుకు శ్రమించాడు. అయితే, ఈ దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా గమనించిన బ్యాంకు కేంద్ర నిఘా విభాగం వెంటనే బ్రాంచి మేనేజర్‌కు సమాచారం అందించింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో సీఐ గీతారామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చోరీ ప్రయత్నం విఫలమై అక్కడి నుంచి వెనుదిరిగిన రంజిత్‌ను పోలీసులు గాలించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ఝార్ఖండ్‌లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడని, ఉద్యోగం రెగ్యులరైజ్ కాకపోవడంతో దాన్ని వదిలేశాడని విచారణలో తేలింది. గత రెండేళ్లుగా అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని తన సోదరుడి వద్దకు వెళ్లిన రంజిత్, తిరిగి ప్రయాణంలో టికెట్ లేకపోవడంతో టీటీఈ అతడిని తునిలో దించేశారు. డబ్బులు లేక ఇబ్బంది పడుతూ పట్టణంలో తిరుగుతున్న క్రమంలోనే అతను ఈ చోరీకి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
Share