మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదల మరోసారి వాయిదా పడటం మెగా అభిమానులను నిరాశకు గురిచేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లను నిజం చేస్తూ, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సినిమా ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ ఈ విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. తొలుత మార్చి 27న, ఆ తర్వాత ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమా జూన్ నెలకు వాయిదా పడింది.వాయిదాకు ప్రధాన కారణం షూటింగ్ పెండింగ్‌లో ఉండటమేనని తెలుస్తోంది. ఒక ఐటమ్ సాంగ్‌తో పాటు మరో పాట చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. దీనికి తోడు ఇటీవల రామ్ చరణ్‌కు కంటి గాయం కావడంతో షూటింగ్లో జాప్యం జరిగింది. ఈ కారణాల వల్ల చిత్రబృందం ఏప్రిల్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమని భావించి,కొత్తవిడుదలతేదీగా జూన్ 25ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది 'పెద్ది' వాయిదా పడటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అఖిల్ నటిస్తున్న 'లెనిన్' చిత్రం ఇప్పటికే జూన్ 26కి వాయిదా పడగా, ఇప్పుడు నిఖిల్ 'స్వయంభు', తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర' వంటి చిత్రాలు ఏప్రిల్ 30వ తేదీని టార్గెట్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది వేసవి సీజన్ పెద్ద స్టార్ హీరోల సందడి లేకుండానే ముగిసేలా కనిపిస్తోంది.