శ్రీకాకుళంలోని చేపల వీధికి చెందిన శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కుమార్తె జెస్విక (చిన్నారి) అనారోగ్యంతో బాధపడుతోంది. తరచూ ఆమె కడుపు నొప్పి అంటుండడంతో బొందిలిపురంలోని ఏ`1 ఆస్పత్రిలో చికిత్స కోసం తల్లిదండ్రులు చేర్పించారు. అయితే నొప్పి పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఆ చిన్నారి ఓ బటన్ను మింగేసిందని, ఆమెకు సర్జరీ చేయాలంటూ ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అయితే సర్జరీ చేసినా నొప్పిని భరించలేకపోతున్నాననంటూ పాప చెబుతున్నా అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆస్పత్రి సిబ్బందికి డైరెక్షన్ ఇచ్చి ఓ ఇంజక్షన్ ఇప్పించేశారు. ఆ ఇంజక్షన్ వికటించడంతో పాప మృతి చెందింది. దీంతో పాప తల్లిదండ్రులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు వైద్యుల తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆస్పత్రి వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నీ అలాగే తయారయ్యాయని, అక్కడి వైద్యులు..రోగుల ప్రాణాలు తీస్తున్నారని, డాక్టర్ల ఆగడాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.