Current Date: 04 Jul, 2024

అవినీతికి పాల్పడితే సహించేది లేదు..

అవినీతి జరిగితే  సహించేది లేదని  నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ స్పష్టం చేశారు. విశాఖ సిటీ నూతన సిపిగా  సోమవారం ఉదయం  ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ  అధికారులు, సిబ్బంది నిజాయితితో పనిచేయాలని, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ఎప్పటిలాగే  కొనసాగుతుందన్నారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందని ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుందని, దానిని అరికడతాం హామీ ఇచ్చారు. ఆపరేషన్ పరివర్తన విజయవంతం అయిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు గానీ సిబ్బందికి గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా 7995095799 ఫోన్ నెంబర్ కు వీడియో, ఆడియో, ఫొటో, మెసేజ్ ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సాధ్యమైనంత వరకు  సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల  మర్యాదగా మెలగాలని, పబ్లిక్ తో ఎవరు మిస్ బిహేవ్ చేయకూడదని సిబ్బందికి హెచ్చరించారు.

Share