Current Date: 24 Feb, 2026

టీమిండియా కొంపముంచిన ఒక్క తప్పిదం.. గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్

టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 74 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ విఫలమై చేతులెత్తేసింది. అయితే ఈ ఓటమికి ఆటగాళ్ల వైఫల్యంతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను కాదని, వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారనే కారణంతో, కేవలం 'మ్యాచ్-అప్'ల కోసం ఆఫ్ స్పిన్నర్ సుందర్‌ను ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. వ్యూహాత్మక నిర్ణయమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థించుకున్నప్పటికీ, మైదానంలో ఆ వ్యూహం ఎక్కడా పనిచేయలేదు. విచిత్రమేమిటంటే, ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారని తీసుకున్న సుందర్‌తో పవర్‌ప్లేలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. కేవలం రెండు ఓవర్లే వేయించిన కెప్టెన్, బ్యాటింగ్‌లోనూ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. అటు బౌలింగ్‌లో ప్రభావం చూపక, ఇటు బ్యాటింగ్‌లోనూ (11 బంతుల్లో 11) విఫలమవ్వడంతో గంభీర్ నిర్ణయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాడిని పక్కనపెట్టి ప్రయోగాలు చేయడం వల్లే భారత్‌కు ఈ పరాభవం ఎదురైందని మండిపడుతున్నారు.