Current Date: 22 Feb, 2026

వేలానికి వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తులు.. రూ.782 కోట్లు బాకీలు!

కర్నూలు మాజీ ఎంపీ, వైకాపా నేత బుట్టా రేణుకకు ఆర్థికపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆమెతో పాటు ఆమె భర్త బుట్టా నీలకంఠ శివ తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో, వారి ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది. గతంలో వారు తీసుకున్న సుమారు రూ. 340 కోట్ల రుణం, వడ్డీలతో కలిపి ప్రస్తుతం రూ. 782.07 కోట్ల భారీ బకాయిగా మారింది. బకాయిల వసూలు కోసం వారు తనఖా పెట్టిన ఆస్తులను విక్రయించే ప్రక్రియను సంస్థ వేగవంతం చేసింది. ఈ వేలం ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ (ఫేజ్-6)లో ఉన్న 3,833 చదరపు గజాల విలువైన స్థలాన్ని విక్రయించనున్నారు. ఈ స్థలంలోనే ప్రముఖ విద్యా సంస్థ 'మెరిడియన్ పాఠశాల' భవనం కూడా ఉంది. ఈ ఆస్తి కనీస విలువను (రిజర్వ్ ప్రైస్) ఎల్‌ఐసీ అధికారులు రూ.65 కోట్లుగా నిర్ణయించారు. దీనికి సంబంధించి బెంగళూరు బ్రాంచ్ అధికారులు ఇప్పటికే అధికారిక వేలం ప్రకటనను విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 23 వరకు ఈ-బిడ్ ఫారాలను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం మార్చి 24న ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయిల చెల్లింపుపై ఎటువంటి ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతోనే బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.