ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్కనిక, ధమ్రా కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు