Current Date: 15 Jul, 2026

నేటితో ముగుస్తుంది 'సర్‌'

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, వివరాలు నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు సమర్పించడానికి మంగళవారంతో గడువు ముగియనుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇంకా 5 నుంచి 10 శాతం మేర డిజిటైజేషన్‌ పెండింగ్‌లోనే ఉంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం కష్టం కావడంతో.. ఎన్యూమరేషన్‌ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్‌ కోసం మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్‌యాదవ్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 98.32 శాతం అంటే 4,09,32,211 మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, ఇందులో సుమారు 39,81,399 పత్రాలు సేకరించడానికి వీలులేనివి (అన్‌ కలెక్టబుల్‌)గా మిగిలిపోయాయి. వీటిలో 14.19 లక్షల మంది మృతులకు సంబంధించినవి కాగా, 12.14 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. ఈ అన్‌ కలెక్టబుల్‌ పత్రాల సంఖ్య తిరుపతి, కడప, గుంటూరు పశ్చిమ, కర్నూలు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉండగా.. నర్సాపురం, భీమవరం, ఆచంట, తిరువూరు వంటి నియోజకవర్గాల్లో చాలా తక్కువగా నమోదైంది. ఎన్యూమరేషన్‌ పత్రాలను ఇంకా బీఎల్‌వోలకు సమర్పించని ఓటర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాటిని అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో జులై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండదని, తద్వారా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పత్రాలు సమర్పించిన ఓటర్లు.. తమ వివరాలను అధికారులు పోర్టల్‌లో డిజిటైజ్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఈసీఐ నెట్‌ యాప్‌లో కానీ లేదా https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో కానీ తమ ఓటరు గుర్తింపు కార్డు నంబరు నమోదు చేసి సులభంగా సరిచూసుకోవచ్చు