Current Date: 08 Feb, 2026

రాజమండ్రిలో పులి కలకలం.. నేషనల్ హైవే‌ పక్కనే ఆశ్రయం!

తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి, మంగళవారం రాత్రి తొలిసారిగా కెమెరాకు చిక్కింది. జనవరి 20న ఏలూరు జిల్లాలో మొదలైన పులి సంచారం, జనవరి 31న గోదావరి దాటి సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. అక్కడ ఆవులపై దాడి చేసి చంపేసిన పులి, మంగళవారం రాత్రికి రాజమహేంద్రవరం శివారులోని ఆటోనగర్ మీదుగా జాతీయ రహదారి పక్కనే ఉన్న దివాన్‌చెరువు ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ పులి దివాన్‌చెరువు పరిధిలోని ఎస్‌వీపీఎస్‌ ఫంక్షన్ హాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న ఒక కొబ్బరి తోటలో ఆశ్రయం పొందుతోంది. ఇది జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండటంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ తోటలోని ఒక పెంకుటింట్లో నివసిస్తున్న తోటమాలి కుటుంబాన్ని అధికారులు అప్రమత్తం చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని ఫోన్ ద్వారా హెచ్చరించారు. రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బి.ఎన్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించేందుకు పూణేకు చెందిన నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు. బుధవారం ఉదయం నాటికి నిపుణులు చేరుకోనుండటంతో, వారి సాయంతో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటివరకు రాజమహేంద్రవరం శివారు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.