Current Date: 04 Jul, 2024

దేశంలో ఎక్కడా జరగని విధంగా.. ఏపీలో 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం!

ఏపీలో పోలింగ్ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 7 ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనలన్నిటినీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించామని చెప్పిన ఆయన.. ఈవీఎంలు ధ్వంసమైనా అప్పటి వరకు వాటిలో ఉన్న డేటా భద్రంగానే ఉంటుందన్నారు.ధ్వంసమైన ఈవీఎంలను పక్కన పెట్టి, అప్పటికప్పుడు కొత్త ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియను కొనసాగించామని చెప్పారు ముకేష్ కుమార్ మీనా. మాచర్లలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఇటీవల ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఈఓ ముకేష్ కుమార్ మీనా వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ జరిపే సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయని ఆయన చెప్పారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో తామేమీ దాచిపెట్టలేదన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని స్పష్టం చేశారు.ఈనెల 20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని, మొదటి నిందితుడిగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొన్నట్టు తెలిపారు. పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారన్నారు. ప్రత్యర్థులపై బాంబులతో సైతం దాడులకు తెగబట్టారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇటు ఈసీ కూడా ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వివరణ కోరింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ చేపట్టింది. మొత్తమ్మీద ఈసారి ఏపీ ఎన్నికలు అటు పోలీసులకు, ఇటు ఎలక్షన్ కమిషన్ కి కూడా తలనొప్పిగా మారాయి.