Current Date: 05 Oct, 2024

బొత్స ఎన్నిక లాంఛనమే! విత్ డ్రా అవుతున్న ఇండిపెండెంట్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమే.ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయనకెవరూ పోటీ లేక పోవడం తో బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పోటీ కి తమ అభ్యర్థి ని పెట్టాలా? లేదా? అని ఊగిసలాడిన టీడీపీ చివరకు తప్పుకుంది.స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన  అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వైసీపీ పెద్దలు జరిపిన చర్చల ద్వారా ఆయన ‘రాజీ’అయిపోయినట్టు తెలిసింది.  వాస్తవానికి ఎవరైనా నామినేషన్‌ వేయాల్సి వస్తే కనీసం 10మంది సభ్యులు (జెడ్పీటీసీ/ఎంపీటీసీ) సంతకం చేయాల్సి ఉంటుంది. సదరు స్వతంత్య్ర అభ్యర్థి పత్రాలపై అలా సంతకాలు చేసి లేకపోతే సహజంగానే ఆ నామినేషన్‌ చెల్లదు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీకి 833ఓట్ల బలం (కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిసి) ఉంది. టీడీపీకి కేవలం 215ఓట్లు మాత్రమే ఉన్నాయి. 

Share