పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, తాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1,050 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని అన్నారు. పట్టిసీమ ద్వారా యేటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందన్నారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమగా మార్చారని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే బంగారమైందన్నారు. కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమేనని తెలిపారు.